Logo

అలియా 1 - Leviticus 16:1 - 16:17

1
అహరోను ఇద్దరు కుమారులు హషేం సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత హషేం మోషేతో మాటలాడి ఇట్లనెను
2
నేను కరుణాపీఠము మీద మేఘ ములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.
3
అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.
4
అతడు ప్రతిష్ఠిత మైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననారపాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠవస్త్ర ములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను.
5
మరియు అతడు ఇశ్రాయేలీయుల సమా జము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను.
6
అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి
7
ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద హషేం సన్నిధిని వాటిని ఉంచవలెను.
8
అప్పుడు అహరోను హషేం పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.
9
ఏ మేకమీద హషేంపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.
10
ఏ మేకమీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయ శ్చి త్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టు టకై హషేం సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచ వలెను.
11
అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొని వచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవ లెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి
12
హషేం సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరి మళధూపచూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు
13
ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, హషేం సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను.
14
అప్పుడతడు ఆ కోడెరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠముమీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను.
15
అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధబలియగు మేకను వధించి అడ్డ తెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్త ముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను.
16
అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతి క్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను.
17
పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవు నప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు.