అలియా 1 - Leviticus 14:1 - 14:12
1
మరియు హషేం మోషేకు ఈలాగు సెల విచ్చెను
2
కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను.
3
యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల
4
యాజకుడు పవి త్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సో పును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.
5
అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి
6
సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి
7
కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణ యించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయ వలెను.
8
అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను.
9
ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.
10
ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.
11
పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున హషేం సన్నిధికి తీసికొనిరావలెను.
12
అప్పుడు యాజకుడు ఒక మగ గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అపరాధ పరిహారార్థబలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా హషేం సన్నిధిని వాటిని అల్లాడింప వలెను.