Logo

అలియా 4 - Genesis 19:21 - 21:4

21
ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని;
22
నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము; నీ వక్కడ చేరువరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను.
23
లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను.
24
అప్పుడు హషేం సొదొమ మీదను గొమొఱ్ఱా మీదను హషేం యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి
25
ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.
26
అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పు స్థంభమాయెను.
27
తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను హషేం సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి
28
సొదొమ గొమొఱ్ఱాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను.
29
దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.
30
లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.
31
అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.
32
మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను.
33
ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.
34
మరునాడు అక్క తన చెల్లెలిని చూచినిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.
35
ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.
36
ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.
37
వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.
38
చిన్నదికూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.
1
అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తర్లిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను.
2
అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను.
3
అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను.
4
అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా?
5
ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యధార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.
6
అందుకు దేవుడు అవును, యధార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు.
7
కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.
8
తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిపించి ఈ సంగతులన్నియు వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి.
9
అబీమెలెకు అబ్రాహామును పిలిపించి నీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను.
10
మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా
11
అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని.
12
అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.
13
దేవుడు నన్ను నా తండ్రి యిల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము; నీవు నాకు చేయవలసిన ఉపకారమిదేయని చెప్పితిననెను.
14
అబీమెలెకు గొఱ్ఱెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను.
15
అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను.
16
మరియు అతడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్ద నున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయ మంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను.
17
అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలు కనిరి.
18
ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.
1
హషేం తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. హషేం తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను.
2
ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలి తనమందు అతనికి కుమారుని కనెను.
3
అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడు నైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను.
4
మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.