హాఫ్తారా - Isaiah 40:27-41:16
27
యాకోబూనా మార్గము హషేంకు మరుగై యున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు?
28
నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన హషేం నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.
29
సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.
30
బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు ¸యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు
31
హషేంకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
1
ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి జనములారా, నూతనబలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి.
2
తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు.
3
అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగ దాటిపోవుచున్నాడు.
4
ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన హషేంనగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.
5
ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు వణకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు
6
వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పు కొందురు.
7
అతుకుటనుగూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని బిగించును.
8
నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,
9
భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,
10
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
11
నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు
12
నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.
13
నీ దేవుడనైన హషేంనగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
14
పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని హషేం సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.
15
కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు
16
నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొని పోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు హషేంనుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.