అలియా 3 - Genesis 7:17 - 8:14
17
ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.
18
జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.
19
ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.
20
పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పోయెను.
21
అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.
22
పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను.
23
నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశ పక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచి వేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.
24
నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.
1
దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.
2
అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను.
3
అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను; నూట ఏబది దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా
4
ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.
5
నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచు వచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.
6
నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి
7
ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.
8
మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనుండి నల్ల పావురమొకటి వెలుపలికి పోవిడిచెను.
9
నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను.
10
అతడు మరి యేడు దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను.
11
సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.
12
అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు.
13
మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలి దినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను.
14
రెండవ నెల యిరువది యేడవ దినమున భూమియెండి యుండెను.