Logo

Haftarah - Isaiah 61:10-63:9

61:10
శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా హషేంనుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది
61:11
భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడినవాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు హషేం నీతిని స్తోత్రమును ఉజ్జీవింప జేయును.
62:1
సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.
62:2
జనములు నీ నీతిని కనుగొనును రాజులందరు నీ మహిమను చూచెదరు హషేం నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్ట బడును.
62:3
నీవు హషేంచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.
62:4
విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. హషేం నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.
62:5
యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.
62:6
యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలి వారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.
62:7
హషేం జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ నియు
62:8
హషేం ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు.
62:9
ధాన్యము కూర్చినవారే దాని భుజించి హషేంకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయమంటపములలో దాని త్రాగుదురు.
62:10
గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.
62:11
ఆలకించుడి, భూదిగంతములవరకు హషేం సమాచారము ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియజేయుడి.
62:12
పరిశుద్ధప్రజలనియు హషేం విమోచించిన వార నియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.
63:1
రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.
63:2
నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి?
63:3
ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే.
63:4
పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను
63:5
నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను.
63:6
కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.
63:7
హషేం మనకు చేసినవాటన్నిటినిబట్టి హషేం కృపాతిశయమును హషేం స్తోత్రము లను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.
63:8
వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.
63:9
వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.