Haftarah - Isaiah 54:1-10
1
గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని హషేం సెలవిచ్చుచున్నాడు.
2
నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.
3
కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.
4
భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.
5
నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు హషేం అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.
6
నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురు షుడు రప్పించినట్లును తృణీకరింపబడిన ¸యౌవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును హషేం నిన్ను పిలుచుచున్నాడు.
7
నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను
8
మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు హషేం సెలవిచ్చు చున్నాడు.
9
నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.
10
పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు హషేం సెలవిచ్చు చున్నాడు.