Logo

Aliyah 2 - Deuteronomy 21:22 - 22:7

21:22
మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల
21:23
అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన హషేం స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.
22:1
నీ సహోదరుని యెద్దుగాని గొఱ్ఱెగాని త్రోవ తప్పిపోవుట చూచినయెడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను.
22:2
నీ సహోదరుడు నీ దగ్గర లేక పోయినయెడలను, నీవు అతని నెరుగకపోయిన యెడలను దానిని నీ యింటికి తోలుకొని పోవలెను. నీ సహోద రుడు దాని వెదకుచువచ్చువరకు అది నీ యొద్దనుండ వలెను, అప్పుడు అతనికి దాని మరల అప్పగింపవలెను.
22:3
అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు ఆలాగుననే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టు కొనినది ఏదైనను నీకు దొరకినయెడల అతడు పోగొట్టు కొనిన దానినిగూర్చి ఆలాగుననే చేయవలెను; నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు.
22:4
నీ సహోదరుని గాడిదగాని యెద్దుగాని త్రోవలో పడియుండుట నీవు చూచినయెడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను.
22:5
స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన హషేంకు హేయులు.
22:6
గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనే గాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడిన యెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్న యెడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును
22:7
నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసికొనవచ్చును.