Haftarah - Isaiah 51:12-52:12
51:12
నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?
51:13
బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన హషేంను నీ సృష్టికర్తయైన హషేంను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?
51:14
క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు.
51:15
నేను నీ దేవుడనైన హషేంను సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు హషేం అని ఆయనకు పేరు.
51:16
నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.
51:17
యెరూషలేమా, లెమ్ము లెమ్ము హషేం క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.
51:18
ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప గలవాడెవడును లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయిపట్టు కొనువాడెవడును లేకపోయెను.
51:19
ఈ రెండు అపాయములు నీకు సంభవించెను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను, నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు దుప్పి వలలో చిక్కు పడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు.
51:20
హషేం క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.
51:21
ద్రాక్షారసములేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము.
51:22
నీ ప్రభువగు హషేం తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు.
51:23
నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.
52:1
సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.
52:2
ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసికొనుము.
52:3
హషేం ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.
52:4
దేవుడైన హషేం అనుకొనుచున్న దేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను.
52:5
నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించు చున్నారు ఇదే హషేం వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది
52:6
కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే హషేం వాక్కు. నా జనులు నా నామము తెలిసికొందురు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలిసికొందురు.
52:7
సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.
52:8
ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు హషేం సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.
52:9
యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి హషేం తన జనులను ఆదరించెను యెరూషలేమును విమోచించెను.
52:10
సమస్తజనముల కన్నులయెదుట హషేం తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.
52:11
పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి హషేం సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి
52:12
మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. హషేం మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును