Haftarah - Jeremiah 1:1-2:3
1:1
బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు
1:2
ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజై యుండగా అతని యేలుబడి పదుమూడవ సంవత్సరమున హషేం వాక్కు యిర్మీయాకు ప్రత్యక్ష మాయెను.
1:3
మరియు యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజైయుండగాను, యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై యుండగాను, అతని యేలుబడి పదునొకండవ సంవత్సరాంతమువరకును, అనగా ఆ సంవత్సరమున అయిదవ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగు చుండెను.
1:4
హషేంవాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
1:5
గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.
1:6
అందుకు అయ్యో ప్రభువగు హషేం, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా
1:7
హషేం నాకీలాగు సెలవిచ్చెను - నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్ప వలెను.
1:8
వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే హషేం వాక్కు.
1:9
అప్పుడు హషేం చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.
1:10
పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యములమీదను నిన్ను నియమించియున్నాను.
1:11
మరియు హషేం వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకుబాదముచెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా
1:12
హషేం నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాననెను.
1:13
రెండవమారు హషేం వాక్కు నాకు ప్రత్యక్షమై - నీకేమి కనబడుచున్నదని సెలవియ్యగా నేనుమసలుచున్న బాన నాకు కనబడుచున్నది; దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని.
1:14
అందుకు హషేం ఈలాగు సెలవిచ్చెను ఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.
1:15
ఇదిగో నేను ఉత్తరదిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థు లను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురు గాను తమ సింహాసనములను స్థాపింతురు.
1:16
అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి, తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట యను తమ చెడుతనమంతటినిబట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును.
1:17
కాబట్టి నీవు నడుముకట్టు కొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.
1:18
యూదా రాజుల యొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలు గాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను.
1:19
వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే హషేం వాక్కు.
2:1
మరియు హషేం వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
2:2
నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. హషేం సెలవిచ్చునదేమనగా - నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ ¸యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.
2:3
అప్పుడు ఇశ్రాయేలు హషేంకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే హషేం వాక్కు.