Logo

హాఫ్తారా - Jeremiah 16:19-17:14

19
హషేం, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చిమా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయో జనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు.
20
నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.
21
కాబట్టి నా నామము హషేం అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును.
1
వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్థంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా
2
యూదా పాపము ఇనుపగంటముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయములనెడి పలకల మీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడియున్నది.
3
పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమునుబట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని నీ బలిపీఠములను దోపుడుసొమ్ముగా నేనప్పగించుచున్నాను.
4
మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు.
5
హషేం ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును హషేంమీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.
6
వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.
7
హషేంను నమ్ముకొను వాడు ధన్యుడు, హషేం వానికి ఆశ్రయముగా ఉండును.
8
వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.
9
హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?
10
ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు హషేం అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.
11
న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించు కొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువ వలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.
12
ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము.
13
ఇశ్రాయేలునకు ఆశ్రయమా, హషేం, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు హషేం అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.
14
హషేం, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు.