Logo

అలియా 4 - Leviticus 25:39 - 26:9

39
నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొన కూడదు.
40
వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను.
41
అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను.
42
ఏల యనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు;
43
నీ దేవునికి భయపడి అట్టివానిని కఠిన ముగా చూడకుము.
44
మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును.
45
మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు.
46
మీ తరు వాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించు కొనకూడదు.
47
పరదేశియేగాని నీయొద్ద నివసించువాడేగాని ధనసంపా దనము చేసికొనునప్పుడు అతనియొద్ద నివసించు నీ సహో దరుడు బీదవాడై నీయొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకని కైనను తన్ను అమ్ముకొనిన యెడల
48
తన్ను అమ్ము కొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడి పింపవచ్చును.
49
వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమా రుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును.
50
అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలు కొని సునాద సంవత్సరమువరకు తన్ను కొనినవానితో లెక్కచూచుకొన వలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలెను. తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను.
51
ఇంక అనేక సంవత్సరములు మిగిలి యుండినయెడల వాటినిబట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఇయ్యవలెను.
52
సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సర ములే తక్కువైన యెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచనక్రయధనమును అతనికి చెల్లింపవలెను.
53
ఏటేటికి జీతగానివలె వాడతనియొద్ద ఉండవలెను. అతడు మీ కన్నులయెదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు.
54
అతడు ఈ రీతిగా విడిపింపబడనియెడల సునాదసంవత్సరమున వాడు తన పిల్లలతో కూడ విడుదలనొందును.
55
ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తుదేశములో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన హషేంను.
1
మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన హషేంను.
2
నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింప వలెను, నేను హషేంను.
3
మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల
4
మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును,
5
మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.
6
ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసె దను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయ పెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు;
7
మీరు మీ శత్రు వులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడె దరు.
8
మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.
9
ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్త రింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.