Logo

హాఫ్తారా - Ezekiel 20:2-20

2
హషేం వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
3
నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము ప్రభువగు హషేం సెలవిచ్చునదేమనగా నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే. నా జీవముతోడు నావలన ఏ ఆలోచనయైనను మీకు దొరకదు; ఇదే ప్రభువగు హషేం వాక్కు.
4
వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయకృత్యములను వారికి తెలియ జేయుము.
5
ఎట్లనగా ప్రభువైన హషేం ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణముచేసిన నాడును, ఐగుప్తుదేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొని ప్రమాణముచేసి నేను మీ దేవుడనైన హషేంనని నేను ప్రకటించిన కాలమున
6
వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.
7
అప్పుడు నేను మీ దేవుడనైన హషేంను, మీలో ప్రతివాడు తన కిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుటచేత మిమ్మును మీరు అపవిత్రపరచు కొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని.
8
అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మాన లేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని.
9
అయితే ఏ అన్య జనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి తిని.
10
వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి అరణ్యము లోనికి తోడుకొని వచ్చి
11
వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైన వాటి ననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును.
12
మరియు హషేంనగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినము లను వారికి సూచనగా నేను నియమించితిని.
13
అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్య మందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూ లము చేయుదునను కొంటిని.
14
అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్య జనులు చూచిరో యే అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామ మునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.
15
మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి, వారు నా విధులను తృణీకరించి నా కట్టడల ననుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా
16
ఇచ్చెదనని నేను సెలవిచ్చి నట్టియు, పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని.
17
అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని.
18
వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితినిమీరు మీ తండ్రుల ఆచారము లను అనుసరింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తింప కయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి.
19
మీ దేవుడనైన హషేంను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి.
20
నేను మీ దేవుడనైన హషేం నని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును.