Logo

Aliyah 3 - Leviticus 17:8 - 18:21

17:8
మరియు నీవు వారితో ఇట్లనుముఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను
17:9
హషేంకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును.
17:10
మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జను లలోనుండి వాని కొట్టివేయుదును.
17:11
రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.
17:12
కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
17:13
మరియు ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివ సించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినయెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము;
17:14
దానిరక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణా ధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
17:15
మరియు కళే బరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశ మందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయం కాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.
17:16
అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండినయెడల వాడు తన దోషశిక్షను భరించును.
18:1
మరియు హషేం మోషేకు ఈలాగు సెల విచ్చెను
18:2
నేను మీ దేవుడనైన హషేంనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.
18:3
మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు.
18:4
మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను హషేంను.
18:5
మీరు నాకట్టడలను నా విధు లను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను హషేంను.
18:6
మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదన మును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను హషేంను.
18:7
నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.
18:8
నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.
18:9
నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టిన దేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తెయొక్క యైనను నీ తల్లి కుమార్తెయొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు.
18:10
నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయ కూడదు; అది నీది.
18:11
నీ తండ్రివలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.
18:12
నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదన మును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
18:13
నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.
18:14
నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి.
18:15
నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయ కూడదు.
18:16
నీ సహోదరుని భార్యమానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.
18:17
ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన.
18:18
నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానా చ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసి కొనకూడదు.
18:19
అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండు నప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.
18:20
నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొన కూడదు.
18:21
నీవు ఏ మాత్రమును నీ సంతానమునుమోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయ కూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను హషేంను.