Aliyah 2 - Leviticus 16:25 - 17:7
16:25
పాప పరిహారార్థబలి పశువుయొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను.
16:26
విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.
16:27
పరిశుద్ధస్థలములో ప్రాయ శ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయ వలెను.
16:28
వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకు కొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెము లోనికి రావలెను.
16:29
ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను.
16:30
ఏలయనగా మీరు హషేం సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచు నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను.
16:31
అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ.
16:32
ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభి షేకముపొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను.
16:33
మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడార మునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్త మును ప్రాయశ్చిత్తము చేయవలెను.
16:34
సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. హషేం మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.
17:1
మరియు హషేం మోషేకు ఈలాగు సెల విచ్చెను.
17:2
నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగుచెప్పుముఇది హషేం ఆజ్ఞాపించిన మాట
17:3
ఇశ్రాయేలీయుల కుటుంబములలో హషేం మందిరము ఎదుట హషేంకు అర్పణము అర్పించుటకు పూనుకొను వాడు అది ఎద్దేగాని గొఱ్ఱెయేగాని మేకయేగాని
17:4
ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళె ములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును;
17:5
వాడు రక్తమును ఒలికించిన వాడు; ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక హషేం పేరట యాజకునియొద్దకు ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధాన బలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టి వేయబడవలెను.
17:6
హషేంకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడార ముయొక్క ద్వారము నొద్దనున్న హషేం బలిపీఠముమీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను.
17:7
వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింప రాదు. ఇది వారి తర తరములకు వారికి నిత్యమైన కట్టడ.