Logo

అలియా 6 - Leviticus 14:33 - 15:15

33
మరియు హషేం మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
34
నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల
35
ఆ యింటి యజమా నుడు యాజకునియొద్దకు వచ్చినా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను.
36
అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను.
37
అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండిన యెడల
38
యాజ కుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను.
39
ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైన యెడల
40
యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను.
41
అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింప వలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి
42
వేరురాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను.
43
అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లుగీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలు పడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను.
44
అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరు కుడు కుష్ఠము; అది అపవిత్రము.
45
కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడ గొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను.
46
మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
47
ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను. ఆ యింట భోజనముచేయు వాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.
48
యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.
49
ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని
50
పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి
51
ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను.
52
అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవ మైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను.
53
అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును.
54
ప్రతివిధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు
55
వస్త్రకుష్ఠమునుగూర్చియు, వస్త్రమునకై నను ఇంటికైనను కలుగు కుష్ఠమునుగూర్చియు,
56
వాపును గూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగ లాడు మచ్చను గూర్చియు,
57
ఒకడు ఎప్పుడు అపవిత్రుడ గునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.
1
మరియు హషేం మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
2
మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలన వాడు అపవిత్రుడగును.
3
వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము;
4
వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము.
5
వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
6
అట్టివాడు దేనిమీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును.
7
స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును.
8
స్రావముగల వాడు పవిత్రునిమీద ఉమ్మివేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
9
స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.
10
వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.
11
స్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
12
స్రావము గలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడు గవలెను.
13
స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకు కొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రు డగును.
14
ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి హషేం సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను.
15
యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో హషేం సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.