అలియా 7 - Leviticus 5:11 - 5:26
11
రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకనియెడల పాపముచేసినవాడు తూమెడు గోధుమపిండిలో పదియవవంతును పాపపరిహారార్థబలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థబలి గనుక దానిమీద నూనెపోయవలదు. సాంబ్రాణి దానిమీద ఉంచవలదు.
12
అతడు యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి హషేంకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది పాపపరిహారార్థబలి.
13
పై చెప్పినవాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషమువలె యాజకునిదగును.
14
మరియు హషేం మోషేకు ఈలాగు సెల విచ్చెను
15
ఒకడు హషేంకు పరిశుద్ధమైన వాటి విష యములో పొరబాటున పాపముచేసినయెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలోనుండి అపరాధ పరిహారార్థ బలిగా హషేంయొద్దకు వాడు తీసికొని రావలెను.
16
పరిశుద్ధమైనదాని విషయ ములో తాను చేసిన పాపమువలని నష్టము నిచ్చుకొని దానితో అయిదవవంతు యాజకునికియ్యవలెను. ఆ యాజకుడు అప రాధపరిహారార్థ బలియగు పొట్టేలువలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
17
చేయకూడదని హషేం ఆజ్ఞాపించినవాటిలో దేని నైనను చేసి ఒకడు పాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకు శిక్ష భరించును.
18
కావున నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకునియొద్దకు తీసికొనిరావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పునుగూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
19
అది అపరాధపరిహారార్థబలి. అతడు హషేంకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము.
20
మరియు హషేం మోషేకు ఈలాగు సెలవిచ్చెను
21
ఒకడు హషేంకు విరోధముగా ద్రోహముచేసి పాపియైనయెడల, అనగా తనకు అప్పగింపబడినదాని గూర్చియేగాని తాకట్టు ఉంచినదాని గూర్చియేగాని, దోచుకొనినదాని గూర్చియేగాని, తన పొరుగువానితో బొంకినయెడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన యెడలనేమి
22
పోయినది తనకు దొరికినప్పుడు దానిగూర్చి బొంకినయెడల నేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగు దురో వాటన్నిటిలో దేనివిషయమైనను అబద్ధప్రమాణము చేసినయెడల నేమి,
23
అతడు పాపముచేసి అపరాధి యగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మునుగూర్చి గాని బలాత్కారముచేతను అపహరించినదానిగూర్చిగాని తనకు అప్పగింపబడినదానిగూర్చిగాని, పోయి తనకు దొరి కినదానిగూర్చిగాని, దేనిగూర్చియైతే తాను అబద్ధప్రమా ణము చేసెనో దానినంతయు మరల ఇచ్చుకొనవలెను.
24
ఆ మూల ధనము నిచ్చుకొని, దానితో దానిలో అయిదవ వంతును తాను అపరాధ పరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను.
25
అతడు హషేంకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకునియొద్దకు తీసికొని రావలెను.
26
ఆ యాజకుడు హషేం సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.