Logo

Aliyah 2 - Leviticus 1:14 - 2:6

1:14
అతడు హషేంకు దహనబలిగా అర్పించునది పక్షి జాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలో నుండిగాని పావు రపు పిల్లలలో నుండిగాని తేవలెను.
1:15
యాజకుడు బలి పీఠముదగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠముమీద దాని దహింపవలెను, దాని రక్తమును బలి పీఠము ప్రక్కను పిండవలెను.
1:16
మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలి పీఠము తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట దానిని పారవేయవలెను.
1:17
అతడు దాని రెక్కలసందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠముమీద, అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా హషేంకు ఇంపైన సువాసనగల హోమము.
2:1
ఒకడు హషేంకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి
2:2
యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని హషేంకు ఇంపైన సువాసనగల హోమముగా బలి పీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.
2:3
ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. హషేంకు అర్పించు హోమ ములలో అది అతిపరిశుద్ధము.
2:4
నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు, పొంగనిదియునైన గోధుమపిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలేగాని కావలెను.
2:5
నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను.
2:6
అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను.