Aliyah 1 - Exodus 27:20 - 28:12
27:20
మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీ యుల కాజ్ఞాపించుము.
27:21
సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు హషేం సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.
28:1
మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.
28:2
అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.
28:3
అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకహృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.
28:4
పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
28:5
వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని
28:6
బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను.
28:7
రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడియుండును.
28:8
మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.
28:9
మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున
28:10
ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.
28:11
ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.
28:12
అప్పుడు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద హషేం సన్నిధిని వారి పేరులను భరించును.