Logo

Aliyah 2 - Exodus 25:17 - 25:40

17
మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయ వలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర.
18
మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.
19
ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను
20
ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచ వలెను.
21
నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.
22
అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.
23
మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.
24
మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయింప వలెను.
25
దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలెను.
26
దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను
27
బల్ల మోయుటకు మోతకఱ్ఱలు ఉంగరములును బద్దెకు సమీపముగా నుండవలెను.
28
ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్లమోయబడును.
29
మరియు నీవు దాని పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్ర లను దానికి చేయవలెను; మేలిమి బంగారుతో వాటిని చేయవలెను.
30
నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను.
31
మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయ వలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమైయుండవలెను.
32
దీప వృక్షముయొక్క ఒక ప్రక్కనుండి మూడుకొమ్మలు, దీపవృక్షముయొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి ఆరుకొమ్మలు నిగుడవలెను.
33
ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను.
34
మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను,
35
దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను.
36
వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయ బడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను.
37
నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.
38
దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.
39
ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను.
40
కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.