Logo

Maftir - Exodus 30:11-30:16 (Shabbat Shekalim)

11
మరియు హషేం మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను.
12
వారు లెక్కింప బడు వేళకు ప్రతివాడు హషేంకు తన ప్రాణపరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.
13
వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము హషేంకు ప్రతిష్ఠార్పణ.
14
ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును హషేంకు అర్పణ నియ్యవలెను.
15
అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు హషేంకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్య కూడదు.
16
నీవు ఇశ్రాయేలీయుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవనిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది హషేం సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును.