Aliyah 2 - Exodus 21:20 - 22:3
21:20
ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును.
21:21
అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మేగదా.
21:22
నరులు పోట్లాడుచుండగా గర్భవతి యైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రానియెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను.
21:23
హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము,
21:24
కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,
21:25
వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.
21:26
ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినయెడల ఆ కంటి హానినిబట్టి వారిని స్వతంత్రునిగా పోనియ్యవలెను.
21:27
వాడు తన దాసుని పల్లయినను తన దాసి పల్లయినను ఊడగొట్టినయెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనియ్య వలెను.
21:28
ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ యెద్దు యజమానుడు నిర్దోషియగును.
21:29
ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను, వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొంద వలెను.
21:30
వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.
21:31
అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను.
21:32
ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి ముప్పది తులములవెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్ట వలెను.
21:33
ఒకడు గోతిమీది కప్పు తీయుటవలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుటవలన, దానిలో ఎద్దయినను గాడిదయైనను పడిన యెడల
21:34
ఆ గోతి ఖామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను; వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను; చచ్చినది వానిదగును.
21:35
ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన యెద్దును పంచుకొనవలెను.
21:36
అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను; చచ్చినది వానిదగును.
22:1
ఒకడు ఎద్దునైనను గొఱ్ఱెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా అయిదు ఎద్దులను ఆ గొఱ్ఱెకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెలను ఇయ్య వలెను.
22:2
దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధ ముండదు.
22:3
సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినయెడల వానికి రక్తాపరాధముండును; వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమియు లేకపోయిన యెడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను.