Aliyah 1 - Exodus 21:1 - 21:19
1
నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా
2
నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.
3
వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.
4
వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకాని వాడు ఒంటిగానే పోవలెను.
5
అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల
6
వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసి కొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.
7
ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు.
8
దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలుకానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించి నందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.
9
తన కుమారునికి దాని ప్రధానము చేసినయెడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దానియెడల జరిగింపవలెను.
10
ఆ కుమా రుడు వేరొక దాని చేర్చుకొనినను, మొదటిదానికి ఆహార మును వస్త్రమును సంసారధర్మమును తక్కువ చేయ కూడదు.
11
ఈ మూడును దానికి కలుగజేయని యెడల అది ఏమియు ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును.
12
నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.
13
అయితే వాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.
14
అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.
15
తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయ ముగా మరణశిక్షనొందును.
16
ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తనయొద్ద నుంచు కొనినను, వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
17
తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయ ముగా మరణశిక్ష నొందును.
18
మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుటవలన వాడు చావక మంచముమీద పడియుండి
19
తరువాత లేచి తన చేతికఱ్ఱతో బయటికి వెళ్లి తిరుగుచుండిన యెడల, వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదుగాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలెను.