Logo

Aliyah 5 - Exodus 15:27 - 16:10

15:27
తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి.
16:1
తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.
16:2
ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను.
16:3
ఇశ్రాయేలీయులు - మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు హషేం చేతివలన ఏల చావక పోతివిు? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా
16:4
హషేం మోషేను చూచి - ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.
16:5
మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను.
16:6
అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో హషేం ఐగుప్తు దేశములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును.
16:7
హషేంమీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు హషేం మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి.
16:8
మరియు మోషే - మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును హషేం మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను హషేంయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట హషేం మీదనేగాని మామీద కాదనెను
16:9
అంతట మోషే అహరోనుతో - హషేం సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను.
16:10
అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు హషేం మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.