Aliyah 3 - Exodus 14:15 - 14:25
15
అంతలో హషేం మోషేతో - నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.
16
నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.
17
ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చుకొందును.
18
నేను ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను హషేంనని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.
19
అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను
20
అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులకు సమీపింపలేదు.
21
మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా హషేం ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
22
నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.
23
ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.
24
అయితే వేకువ జామున హషేం ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి
25
వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; హషేం వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.