Logo

Haftarah - Jeremiah 46:13-28

13
బబులోనురాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతముచేయుటను గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన హషేం వాక్కు.
14
ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నొపులోను తహపనేసులోను ప్రకటనచేయుడి ఏమనగాఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మింగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.
15
నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడు చున్నారు? హషేం వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు.
16
ఆయన అనేకులను తొట్రిల్ల జేయుచున్నాడు వారొకనిమీద ఒకడు కూలుచు లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి అని వారు చెప్పుకొందురు.
17
ఐగుప్తురాజగు ఫరో యుక్తసమయము పోగొట్టుకొను వాడనియు వట్టిధ్వని మాత్రమేయని వారచ్చట చాటించిరి.
18
పర్వతములలో తాబోరు ఎట్టిదో సముద్రప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును రాజును సైన్యములకధిపతియునగు హషేం వాక్కు ఇదే.
19
ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.
20
ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చే యున్నది.
21
పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను.
22
శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది హషేం వాక్కు ఇదే
23
లెక్కలేనివారై మిడతలకన్న విస్తరింతురు చొర శక్యముకాని ఆమె అరణ్యమును నరికివేయు దురు.
24
ఐగుప్తు కూమారి అవమానపరచబడును ఉత్తరదేశస్థులకు ఆమె అప్పగింపబడును
25
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు హషేం ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించు చున్నాను.
26
వారి ప్రాణము తీయజూచు బబులోనురాజైన నెబుకద్రెజరు చేతికిని అతని సేవకులచేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అది మునుపటివలెనే నివాసస్థలమగును ఇదే హషేం వాక్కు.
27
నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము ఇశ్రాయేలూ, జడియకుము దూరములోనుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండ యాకోబు తిరిగివచ్చును అతడు నిమ్మళించి నెమ్మదినొందును.
28
నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై యున్నాను భయపడకుము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశప్రజలను సమూల నాశనము చేసెదను అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమునుబట్టి నిన్ను శిక్షించెదను ఇదే హషేం వాక్కు.