Aliyah 6 - Exodus 12:29 - 12:51
29
అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని హషేం హతము చేసెను.
30
ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.
31
ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో - మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి హషేంను సేవించుడి.
32
మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.
33
ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి.
34
కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టు కొని, తమ భుజములమీద పెట్టుకొని పోయిరి.
35
ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.
36
హషేం ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
37
అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.
38
అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను.
39
వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.
40
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.
41
ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే హషేం సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను.
42
ఆయన ఐగుప్తుదేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది హషేంకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో హషేంకు ఆచరింపదగిన రాత్రి యిదే.
43
మరియు హషేం మోషే అహరోనులతో ఇట్లనెను - ఇది పస్కాపండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని
44
వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.
45
పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.
46
మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు.
47
ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.
48
నీయొద్ద నివసించు పరదేశి హషేం పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.
49
దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలె ననెను.
50
ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; హషేం మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.
51
హషేం ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.