Logo

Aliyah 5 - Exodus 12:21 - 12:28

21
కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెను - మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి.
22
మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింప వలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు.
23
హషేం ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి హషేం ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.
24
కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.
25
హషేం తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను.
26
మరియు మీకుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు
27
మీరు ఇది హషేంకు పస్కాబలి; ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి.
28
అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; హషేం మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి.