Logo

అలియా 4 - Exodus 11:4 - 12:20

4
మోషే ఫరోతో ఇట్లనెను - హషేం సెలవిచ్చిన దేమనగా - మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను.
5
అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతువులలోను తొలిపిల్లలన్నియు చచ్చును.
6
అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.
7
హషేం ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.
8
అప్పుడు నీ సేవకులైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి - నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదననెను. మోషే ఆలాగు చెప్పి ఫరో యొద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను.
9
అప్పుడు హషేం - ఐగుప్తుదేశములో నా మహ త్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.
10
మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను హషేం ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను.
1
మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా హషేం వారితో ఈలాగు సెలవిచ్చెను
2
నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.
3
మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో - ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.
4
ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను.
5
ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.
6
నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.
7
ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి
8
ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను
9
దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను;
10
దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.
11
మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది హషేంకు పస్కాబలి.
12
ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను హషేంను.
13
మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.
14
కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు హషేంకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.
15
ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.
16
ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయకూడదు.
17
పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.
18
మొదటి నెల పదునాలుగవదినము సాయం కాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.
19
ఏడు దినములు మీ యిండ్లలో పొంగిన దేదియును ఉండకూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టిన వాడేగాని ఇశ్రాయేలీ యుల సమాజములో నుండక కొట్టివేయబడును.
20
మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను.