Logo

Aliyah 1 - Exodus 10:1 - 10:11

1
కాగా హషేం మోషేతో ఫరోయొద్దకు వెళ్లుము. నేనే హషేంనని మీరు తెలిసికొనునట్లును, నేను చేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కనుపరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను
2
నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిననెను.
3
కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి - హెబ్రీయుల దేవుడగు హషేం సెలవిచ్చినదేమనగా - నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
4
నీవు నా జనులను పోనియ్య నొల్లనియెడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను.
5
ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్లదెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును.
6
మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుట నుండి బయలు వెళ్లెను.
7
అప్పుడు ఫరో సేవకులు అతని చూచి - ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన హషేంను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకా తెలియదా అనిరి.
8
మోషే అహరోనులు ఫరోయొద్దకు మరల రప్పింపబడగా అతడుమీరు వెళ్లి మీ దేవుడైన హషేంను సేవించుడి; అందుకు ఎవరెవరు వెళ్లుదురని వారి నడిగెను.
9
అందుకు మోషే - మేము హషేంకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెద మనెను.
10
అందు కతడు - హషేం మీకు తోడై యుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు.
11
పురుషులైన మీరు మాత్రము వెళ్లి హషేంను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి.