Logo

Aliyah 5 - Exodus 3:16 - 4:17

3:16
నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన హషేం, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని,
3:17
ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.
3:18
వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజు నొద్దకు వెళ్లి అతని చూచి హెబ్రీయుల దేవుడైన హషేం మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన హషేంకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.
3:19
ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును;
3:20
కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.
3:21
జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు.
3:22
ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.
4:1
అందుకు మోషే - చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు - హషేం నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా
4:2
హషేం నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు కఱ్ఱ అనెను.
4:3
అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను.
4:4
అప్పుడు హషేం - నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.
4:5
ఆయన దానిచేత వారు తమ పితరుల దేవుడైన హషేం, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్ష మాయెనని నమ్ముదురనెను.
4:6
మరియు హషేం నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను.
4:7
తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.
4:8
మరియు ఆయన వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు.
4:9
వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.
4:10
అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని హషేంతో చెప్పగా
4:11
హషేం మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని పుట్టించినవాడెవడు? హషేంనైన నేనే గదా.
4:12
కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.
4:13
అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా
4:14
ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;
4:15
నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి, మీరు చేయవలసినదానిని మీకు బోధించెదను.
4:16
అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.
4:17
ఈ కఱ్ఱను చేతపట్టు కొనిదానితో ఆ సూచక క్రియలు చేయవలెననిచెప్పెను.