Aliyah 2 - Exodus 1:18 - 2:10
1:18
ఐగుప్తురాజు ఆ మంత్ర సానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రదుకనిచ్చితిరి? ఈ పనియేల చేసితిరి అని అడిగెను.
1:19
అందుకు ఆ మంత్ర సానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.
1:20
దేవుడు ఆ మంత్ర సానులకు మేలుచేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను.
1:21
ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను.
1:22
అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.
2:1
లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను.
2:2
ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని, వాడు సుందరుడై యుండుట చూచి మూడునెలలు వానిని దాచెను.
2:3
తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టియేటి యొడ్డున జమ్ములో దానిని ఉంచగా,
2:4
వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను.
2:5
ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి, తన పనికత్తె నొకతెను పంపి దాని తెప్పించి
2:6
తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను.
2:7
అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను.
2:8
అందుకు ఫరో కుమార్తె వెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.
2:9
ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొని పోయి పాలిచ్చి పెంచెను.
2:10
ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను.