Aliyah 6 - Genesis 49:27 - 50:20
49:27
బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.
49:28
ఇవి అన్నియు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను.
49:29
తరువాత అతడు వారి కాజ్ఞాపించుచు ఇట్లనెను - నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను.
49:30
హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను.
49:31
అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.
49:32
ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారుల యొద్ద కొనబడినదనెను.
49:33
యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చబడెను.
50:1
యోసేపు తన తండ్రి ముఖముమీద పడి అతని గూర్చి యేడ్చి అతని ముద్దుపెట్టుకొనెను.
50:2
తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి.
50:3
సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి.
50:4
అతనిగూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి - మీ కటాక్షము నామీద నున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి
50:5
నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి - ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను.
50:6
అందుకు ఫరో అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను.
50:7
కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను; అతనితో ఫరో యింటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును
50:8
యోసేపు యింటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱెల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి.
50:9
మరియు రథములును రౌతులును అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తారమాయెను.
50:10
యెర్దానునకు అవతలనున్న ఆఠదు కళ్లమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి యేడు దినములు దుఃఖము సలిపెను.
50:11
ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి - ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతల నున్నది.
50:12
అతని కుమారులు తన విషయమై అతడు వారి కాజ్ఞాపించినట్లు చేసిరి.
50:13
అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతి పెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానముకొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రే యెదుట హిత్తెయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను
50:14
యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులును అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరును తిరిగి ఐగుప్తునకు వచ్చిరి.
50:15
యోసేపు సహోదరులు తమ తండ్రి మృతిపొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మన మతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని
50:16
యోసేపునకు ఈలాగు వర్తమాన మంపిరి
50:17
- నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిన దేమనగా - మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులా అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను.
50:18
మరియు అతని సహోదరులు పోయి అతని యెదుట సాగిలపడి ఇదిగో - మేము నీకు దాసులమని చెప్పగా
50:19
యోసేపు - భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా?
50:20
మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.