Logo

Aliyah 1 - Genesis 47:28 - 48:9

47:28
యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు.
47:29
ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి - నా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము.
47:30
నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను.
47:31
అందుకతడు - నేను నీ మాట చొప్పున చేసెదననెను. మరియు అతడు - నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపిమీద వంగి దేవునికి నమస్కారము చేసెను.
48:1
ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా,
48:2
ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను.
48:3
యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి
48:4
ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను.
48:5
ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు.
48:6
వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు.
48:7
పద్దనరామునుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను.
48:8
ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి - వీరెవరని అడుగగా
48:9
యోసేపు - వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు - నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొనిరమ్మనెను.