Logo

Haftarah - Ezekiel 37:15-28

15
మరియు హషేం వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
16
నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారి దనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇశ్రాయేలువారి దనియు వ్రాయుము.
17
అప్పుడది యేకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక యగును.
18
ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అని నీ జనులు నిన్నడుగగా
19
ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము ప్రభువైన హషేం సెలవిచ్చునదేమనగా ఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారితోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను.
20
ఇట్లుండగా వారి కీలాగు చెప్పుము
21
ప్రభువైన హషేం సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి
22
వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద
23
వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయ క్రియలవలనగాని యే అతి క్రమక్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును.
24
నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు.
25
మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.
26
నేను వారితో సమాధా నార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను.
27
నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.
28
మరియు వారి మధ్య నా పరిశుద్ధస్థలము నిత్యము ఉండు టనుబట్టి హషేంనైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్య జనులు తెలిసికొందురు.