Logo

Aliyah 7 - Genesis 47:11 - 47:27

11
ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి, ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను.
12
మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరిని వారివారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.
13
కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవువలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను.
14
వచ్చినవారికి ధాన్యమమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను.
15
ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపు నొద్దకు వచ్చి - మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి.
16
అందుకు యోసేపు - మీ పశువులను ఇయ్యుడి; ద్రవ్యము వ్యయమైపోయిన యెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదనని చెప్పెను, కాబట్టి వారు తమ పశువులను యోసేపునొద్దకు తీసికొనవచ్చిరి. యోసేపు గుఱ్ఱములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసికొని వారికి ఆహారమిచ్చెను
17
ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.
18
ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి ఇది మా యేలినవారికి మరుగుచేయము; ద్రవ్యము వ్యయమై పోయెను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు.
19
నీ కన్నుల యెదుట మా పొలములును మేమును నశింపనేల? ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము; మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము; మేము చావక బ్రదుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనము లిమ్మని అడిగిరి.
20
అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరో కొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరు తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక, భూమి ఫరోది ఆయెను.
21
అతడు ఐగుప్తు పొలిమేరలయొక్క యీ చివరనుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను.
22
యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు.
23
యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు; పొలములలో విత్తుడి.
24
పంటలో అయిదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై యుండునని ప్రజలతో చెప్పగా
25
వారు - నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మా మీదనుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి.
26
అప్పుడు అయిదవ భాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు.
27
ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి.