Logo

Aliyah 6 - Genesis 46:28 - 47:10

46:28
అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా
46:29
యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.
46:30
అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో - నీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను.
46:31
యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినిచూచి - నేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనాను దేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి;
46:32
ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱెల కాపరులు. వారు తమ గొఱ్ఱెలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పెదను.
46:33
గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల
46:34
మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు - మా చిన్నతనమునుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గల వారమై యున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను.
47:1
యోసేపు వెళ్లి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి
47:2
తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొనిపోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను.
47:3
ఫరో అతని సహోదరులను చూచి - మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు - నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి.
47:4
మరియు వారు - కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితివిు. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా
47:5
ఫరో యోసేపును చూచి - నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు.
47:6
ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము, గోషెను దేశములో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచిన యెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను
47:7
మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.
47:8
ఫరో - నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగి నందుకు
47:9
యాకోబు - నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి
47:10
ఫరోను దీవించి ఫరో యెదుటనుండి వెళ్లిపోయెను.