Aliyah 3 - Genesis 45:8 - 45:18
8
కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటివారి కందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను.
9
మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో - నీ కుమారుడైన యోసేపు - దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు;
10
నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెల మందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును.
11
ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.
12
ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి.
13
ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి
14
తన తమ్ముడైన బెన్యామీను మెడమీద పడి యేడ్చెను; బెన్యామీను అతని మెడమీదపడి యేడ్చెను.
15
అతడు తన సహోదరులందరిని ముద్దుపెట్టుకొని వారిమీద పడియేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.
16
యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను.
17
అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను - నీవు నీ సహోదరులను చూచి - మీరీలాగు చేయుడి, మీ పశువులమీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి
18
మీ తండ్రిని మీ యింటివారిని వెంట బెట్టుకొని నా యొద్దకు రండి; ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకెచ్చెదను, ఈ దేశముయొక్క సారమును మీరు అనుభవించెదరు.