అలియా 5 - Genesis 42:19 - 43:15
19
మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.
20
మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.
21
అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి;అందువలన ఈ వేదన మనకు వచ్చెదనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి .
22
మరియు రూబేను ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారి కుత్తర మిచ్చెను.
23
అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.
24
అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.
25
మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను.
26
వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి.
27
అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను.
28
అప్పుడతడు - నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనె లోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి - ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
29
వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి.
30
ఎట్లనగా - ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.
31
అప్పుడు మేము యథార్థవంతులము, వేగులవారము కాము.
32
పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితివిు.
33
అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు
34
నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి.
35
వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి.
36
అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను.
37
అందుకు రూబేను - నేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను.
38
అయితే అతడు నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.
1
ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక
2
వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి - మీరు మరల వెళ్లి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా
3
యూదా అతని చూచి - ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.
4
కాబట్టి నీవు మాతమ్ముని మాతో కూడ పంపిన యెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము.
5
నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడు - మీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.
6
అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా
7
వారు ఆ మనుష్యుడు - మీ తండ్రి యింక సజీవుడైయున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితివిు - మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి.
8
యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;
9
నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టని యెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును.
10
మాకు తడవు కాకపోయిన యెడల ఈపాటికి రెండవ మారు తిరిగి వచ్చి యుందుమని చెప్పగా
11
వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితొ అట్లయిన మీరీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదముకాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొని పోవుడి.
12
రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేత పట్టు కొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును;
13
మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి.
14
ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై యుండవలసిన యెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను.
15
ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.