Logo

అలియా 4 - Genesis 41:53 - 42:18

53
ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత
54
యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను.
55
ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో - మీరు యోసేపు నొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను.
56
కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను;
57
మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.
1
ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.
2
మరియు అతడు - చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా
3
యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.
4
అయినను - ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.
5
కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.
6
అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి.
7
యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి - మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు - ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.
8
యోసేపు తన సహోదరులను గురుతు పట్టెను గాని వారతని గురుతు పట్టలేదు.
9
యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని - మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా
10
వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితివిు;
11
మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.
12
అయితే అతడు - లేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను.
13
అందుకు వారు - నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.
14
అయితే యోసేపు - మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.
15
దీనివలన మీ నిజము తెలియబడును; ఫరో జీవము తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడనుండి వెళ్లకూడదు.
16
మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి
17
వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.
18
మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.