Aliyah 3 - Genesis 41:39 - 41:52
39
మరియు ఫరో - దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు.
40
నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.
41
మరియు ఫరో - చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను.
42
మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి
43
తన రెండవ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు - వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.
44
మరియు ఫరో యోసేపుతో - ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.
45
మరియు ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను.
46
యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను.
47
సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను.
48
ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆయా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను.
49
యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్యమాయెను గనుక కొలుచుట మానివేసెను.
50
కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను.
51
అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.
52
తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.