Logo

Aliyah 1 - Genesis 41:1 - 41:14

1
రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా
2
చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.
3
వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను.
4
అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.
5
అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను.
6
మరియు తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను.
7
అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను.
8
తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను.
9
అప్పుడు పానదాయకుల అధిపతి - నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను.
10
ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి యింట కావలిలో ఉంచెను.
11
ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములు గల కలలు చెరి యొకటి కంటిమి.
12
అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతో కూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను.
13
అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా
14
ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను.