Aliyah 7 - Genesis 40:1 - 40:23
1
అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి
2
గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థులమీద కోపపడి
3
వారిని చెరసాలలో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము.
4
ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్నిదినములు కావలిలో నుండిన తరువాత
5
వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కలకనెను.
6
తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతా క్రాంతులై యుండిరి.
7
అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలి యందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను.
8
అందుకు వారుమేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను.
9
అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను;
10
ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను.
11
మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను.
12
అప్పుడు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు;
13
ఇంక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు
14
కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.
15
ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.
16
అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను - నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలుగల మూడు గంపలు నా తలమీద ఉండెను.
17
మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసికొని తినుచుండెను.
18
అందుకు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు
19
ఇంక మూడు దినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీమీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను.
20
మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి
21
పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను.
22
మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.
23
అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను.