Logo

Aliyah 1 - Genesis 37:1 - 37:11

1
యాకోబు తన తండ్రి పరదేశ వాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.
2
యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.
3
మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.
4
అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.
5
యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపట్టిరి.
6
అతడు వారినిచూచి - నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి.
7
అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను.
8
అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగ పట్టిరి.
9
అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను.
10
అతడు తన తండ్రితోను తన సహోదరుల తోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను.
11
అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.