అలియా 6 - Genesis 35:12 - 36:19
12
నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను; నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను.
13
దేవుడు అతనితో మాటలాడిన స్థలమునుండి పరమునకు వెళ్లెను.
14
ఆయన తనతో మాటలాడినచోట యాకోబు ఒక స్తంభము, అనగా రాతిస్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను.
15
తనతో దేవుడు మాటలాడినచోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలునుండి ప్రయాణమై పోయిరి.
16
ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను.
17
ఆమె ప్రసవమువలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో - భయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను.
18
ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
19
అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను.
20
యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము.
21
ఇశ్రాయేలు ప్రయాణమై పోయి మిగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసెను.
22
ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.
23
యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.
24
రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.
25
రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.
26
లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.
27
అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్య తర్బాకు తన తండ్రియైన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను.
28
ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు.
29
ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి.
1
ఎదోమను ఏశావు వంశావళి ఇదే,
2
ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను,
3
ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియు నైన బాశెమతును పెండ్లియాడెను.
4
ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.
5
అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే.
6
ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను;
7
వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.
8
అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము.
9
శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే,
10
ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్యయైన ఆదా కుమారుడగు ఎలీఫజును ఏశావు భార్యయైన బాశెమతు కుమారుడగు రగూయేలును.
11
ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని.
12
ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు.
13
రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ; వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.
14
ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహొలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు.
15
ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు,
16
కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయ కులు. వీరు ఆదా కుమారులు.
17
వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.
18
వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు.
19
ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు.