Logo

Aliyah 7 - Genesis 31:43 - 32:3

31:43
అందుకు లాబాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారుల నైనను నేనేమి చేయగలను.
31:44
కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా
31:45
యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను.
31:46
మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.
31:47
లాబాను దానికి యగర్‌ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.
31:48
లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా హషేం నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
31:49
అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము,
31:50
మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.
31:51
మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము.
31:52
హానిచేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.
31:53
అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.
31:54
యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.
32:1
తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లి పోయెను.
32:2
యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.
32:3
యాకోబు వారిని చూచి - ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.