Logo

Aliyah 5 - Genesis 30:28 - 31:16

30:28
మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.
30:29
అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;
30:30
నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల హషేం నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.
30:31
అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.
30:32
నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును.
30:33
ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్న యెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.
30:34
అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కానిమ్మనెను.
30:35
ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటి నన్నిటిని వేరుచేసి తన కుమారుల చేతి కప్పగించి
30:36
తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను.
30:37
యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి
30:38
మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా
30:39
మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.
30:40
యాకోబు ఆ గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను.
30:41
మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను.
30:42
మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబు నకును వచ్చెను.
30:43
ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.
31:1
లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.
31:2
మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.
31:3
అప్పుడు హషేం నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా
31:4
యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను.
31:5
మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు;
31:6
మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.
31:7
మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.
31:8
అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.
31:9
అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.
31:10
మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.
31:11
మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.
31:12
అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని
31:13
నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
31:14
అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలు పంపు లెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా?
31:15
అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను.
31:16
దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికుత్తర మియ్యగా