Logo

Aliyah 4 - Genesis 30:14 - 30:27

14
గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు - నీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా
15
ఆమె - నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు - కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.
16
సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి - నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.
17
దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
18
లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
19
లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.
20
అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.
21
ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
22
దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
23
అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను.
24
మరియు ఆమె - హషేం మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
25
రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో - నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.
26
నా భార్యలను నా పిల్లలను నాకప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను.
27
అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి హషేం నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.