Aliyah 3 - Genesis 29:18 - 30:13
29:18
యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.
29:19
అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుటకంటె నీకిచ్చుట మేలు; నాయొద్ద ఉండుమని చెప్పగా
29:20
యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.
29:21
తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా
29:22
లాబాను ఆ స్థలములోనున్న మనుష్యుల నందరిని పోగుచేసి విందు చేయించి
29:23
రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతని యొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.
29:24
మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.
29:25
ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను.
29:26
అందుకు లాబాను పెద్ద దానికంటె ముందుగా చిన్నదాని నిచ్చుట మాదేశ మర్యాదకాదు.
29:27
ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా
29:28
యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరువాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.
29:29
మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.
29:30
యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.
29:31
లేయా ద్వేషింపబడుట హషేం చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.
29:32
లేయా గర్భవతియై కుమారుని కని, హషేం నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.
29:33
ఆమె మరల గర్భవతియై కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి హషేం విన్నాడు గనుక ఇతనికూడ నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను.
29:34
ఆమె మరల గర్భవతియై కుమారుని కని తుదకు ఈ సారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను
29:35
ఆమె మరల గర్భవతియై కుమారుని కని ఈ - సారి హషేంను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.
30:1
రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో - నాకు గర్భఫలమునిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను.
30:2
యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు - నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.
30:3
అందుకామె - నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి
30:4
తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా
30:5
బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.
30:6
అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.
30:7
రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.
30:8
అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
30:9
లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.
30:10
లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా
30:11
లేయా - ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
30:12
లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
30:13
లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.