Aliyah 6 - Genesis 27:28 - 28:4
27:28
ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక
27:29
జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధు జనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక
27:30
ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలు దేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను.
27:31
అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చినా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను.
27:32
అతని తండ్రియైన ఇస్సాకు - నీ వెవరవని అతని నడిగినప్పుడు అతడునేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా
27:33
ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.
27:34
ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి - ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.
27:35
అతడు - నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.
27:36
ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పి - నా కొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.
27:37
అందుకు ఇస్సాకు - ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయవలెనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా¸
27:38
ఏశావు నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు -
27:39
నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపుమంచు లేకయు నుండును.
27:40
నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడ మీదనుండి అతని కాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.
27:41
తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.
27:42
రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను - ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్నుతాను ఓదార్చుకొను చున్నాడు.
27:43
కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు
27:44
నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము;
27:45
అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొననేల అనెను.
27:46
మరియు రిబ్కా ఇస్సాకుతో - హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.
28:1
ఇస్సాకు యాకోబును పిలిపించి - నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.
28:2
నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి
28:3
సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామున కిచ్చిన దేశమును, నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు
28:4
ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను.